ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఈరోజు క్లారిటీ రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రవాణా శాఖ అధికారులతో కలిసి నేడు మీటింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నేరుగా అమరావతి చేరుకుని ఉదయం పదకొండు గంటలకు అధికారులతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పరిశీలిస్తారు. ఇప్పటికే అధికారులు పనులు పూర్తి చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైతే బస్సుల సంఖ్య పెరిగి ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని అంచనా.
కేవలం ఈ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం
ఏడాదికి ఆర్టీసీకి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలి. ఆర్టీసీ నష్టాల్లో ఉందని, ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ బస్సుల్లోనే కాకుండా విజయవాడ, విశాఖ వంటి పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే సిటీ సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. అయితే ఉచిత బస్సు పథకం అమలుకు ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్య సరిపోదని అధికారులు వాదిస్తున్నారు.
పూర్తి వివరాలతో చంద్రబాబు ముందుకు…
కొత్త బస్సుల కొనుగోలుకు ఎంత ఖర్చవుతుంది? ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీపై ఎంత భారం? పక్కా లెక్కతో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల 250 కోట్ల వార్షిక భారం పడుతుందని ప్రాథమిక అంచనా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రవాణా, ఆర్టీసీ అధికారులు ఇప్పటికే పర్యటించినందున అక్కడ జరుగుతున్న తప్పులు, మంచి పనులను పరిశీలించి నేడు విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. . . అన్నీ సవ్యంగా జరిగితే ఆగస్టు 15 లేదా దాని తరువాత రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.