ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ణబ్ తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్రం కూడా సహాయం చేయడానికి సుముఖంగా ఉండండని అమిత్ షా తెలిపారని చెప్పారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 30వ తేదీ సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని, అక్కడ పరిస్థితులు అనుకూలించనందున ఇంతసమయం పడుతోందని తెలిపారు. మిగితా జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుండి విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
వ్యవసాయ, ఉద్యానవన పంటలు తీవ్రంగా నష్టపోయాయని నష్టాల ఎన్యూమరేషన్ కు సమయం పడుతుందని, అది పూర్తయ్యాక కాబినెట్ సమావేశంలో ఆర్ధిక సాయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పంట నష్టాలపై సమగ్ర నివేదికను త్వరగా కేంద్రానికి పంపి అందరికి సాయం అందేలా చర్యలు చేపడతామన్నారు.
అర్ణబ్ తుఫాన్ కారణంగా ఐదుగురు మృతి చెందారని, వీరి కుటుంబాలకు 5 లక్షలు పరిహారం అందించి, వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. కొన్నిప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు తుఫాన్ వల్ల పడటంవల్ల వారికి సహాయం చేయడంలో ఆలస్యం అవుతోందని, త్వరితగతిన వాటిని పునరుద్ధరించి సహాయ కార్యక్రమాలు వేగవంతం చేస్తామన్నారు.
తుఫాన్ కారణంగా ధ్వంసమైనా ఇళ్లకు 10 వేలు, దుకాణాలకు 25 వేలు, ద్విచక్ర వాహనానికి 3 వేలు, త్రిచక్ర వాహనాలు 10 వేలు, పుష్ కార్ట్ లకు 20 వేలు, ఫిషింగ్ బోట్ కి 25 వేలు, చెరుకు పంటకు 25 వేలు, అరటికి 35 వేలు, టమాటో 25 వేలు, కొబ్బరి, పామాయిల్ కి 15 వేలు చొప్పున, మృతిచెందిన పశువులకు ఆర్ధిక సహాయం అందించనున్నారు.
